**ఫడణవీస్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా **

ముంబయి: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాత్రికి రాత్రే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడణవీస్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవికి అజిత్‌ పవార్‌ రాజీనామా చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఫడణవీస్‌ తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. రేపు సాయంత్రం 5 గంటల్లోపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఫడణవీస్‌ రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.


బలపరీక్షకు ముందే ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్ వ్యూహాత్మకంగా చక్రం తిప్పారు. కుటుంబసభ్యులతో అజిత్ పవార్‌పై ఒత్తిడి తేవడంతో ఆయన వెనక్కి తగ్గారు. ఉపముఖ్యమంత్రికి రాజీనామా చేశారు. దీంతో భాజపా పరిస్థితి డోలాయమానంలో పడింది. ఈ కారణంగా దేవేంద్ర ఫడణవీస్‌ కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది.